Clean and Green Policy: తెలంగాణ క్లీన్ & గ్రీన్ ఎనర్జీ పాలసీ-2024..! 2 d ago
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 11 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, నిల్వ సామర్థ్యానికి అదనంగా.. 2030 నాటికి 20 వేల మెగావాట్లు జోడించాలన్న లక్ష్యంతో తెలంగాణ క్లీన్ & గ్రీన్ ఎనర్జీ పాలసీ-2024ను తెలంగాణ ప్రభుత్వం తీసుకురానుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు స్వతంత్ర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, ఫ్లోటింగ్ సోలార్, వేస్ట్ టు ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి వినూత్న పరిష్కారాలపై దృష్టి సారించనున్నారు.
ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ వంటి వివిధ మెగా ఇన్ఫ్రా ప్రాజెక్టులతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గరిష్టంగా పెరగనుంది. 2024లో విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్లు నమోదైంది. ఇది 2030 నాటికి 24,215 మెగావాట్లకు, 2035 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. ఈ విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి స్వచ్ఛమైన, విశ్వసనీయమైన, చౌకగా లభించే స్థిరమైన ఇంధన పరిష్కారాలు చూపేందుకు ఈ పాలసీ దోహదపడుతుంది. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా జాయింట్ వెంచర్లుగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేలా విధివిధానాలు రూపొందించనున్నారు. 20 వేల గ్రీన్ ఎనర్జీ ఇంధన ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎమ్ కుసుమ్ పథకం ద్వారా 4వేల మెగావాట్ల వరకు మహిళా స్వయం సహాయక బృందాలకు కేటాయిస్తూ కేంద్రప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. తెలంగాణలో క్లిష్టమైన ఖనిజాలను వెలికి తీసేందుకు సమర్థవంతమైన మార్గాలు కనుగొనడం, స్థిరమైన మైనింగ్ పద్ధతులను అవలంబించేందుకు తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తుంది.